సివిల్స్-2019 ఫలితాల్లో సిద్ధిపేట కుర్రోడికి 110 ర్యాంకు

మంగళవారం, 4 ఆగస్టు 2020 (16:48 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ 2019 పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కుర్రోడు మంద మకరంద్ జాతీయ స్థాయిలో 110వ ర్యాంకును సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా, మకరంద్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. 
 
సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్‌ను అభినందించారు. మకరంద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ నాలుగు దశాబ్దాల కిందట సిద్ధిపేటలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
 
మహిళల్లో ప్రతిభ - పురుషుల్లో ప్రదీప్ 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ 2019 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. వివిధ సర్వీసులకు సంబంధించిన ఫలితాలు ఇందులో ఉన్నాయి. ఈ ఫలితాల్లో మహిళల్లో ప్రతిభా వర్మకు టాప్ ర్యాంకు దక్కింది. అలాగే, పురుషుల్లో ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలిచారు. 
 
సివిల్స్-2019 నియామకాలకు సంబంధించి గతేడాది సెప్టెంబరులో రాత పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఫలితాలను మంగళవారం విడుదల చేయగా, సివిల్స్-2019 నియామకపు పరీక్షల్లో మొత్తం 829 అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. 
 
కాగా, 11 మంది అభ్యర్థుల ఫలితాలను విత్ హెల్డ్‌లో ఉంచారు. ఇక, ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మే 31న జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్టోబరు 4కి వాయిదా వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు