ఢిల్లీలో కరోనా విజృంభణ.. 23 శాతం మందికి వైరస్..

బుధవారం, 22 జులై 2020 (10:06 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీ జనాభాలో 23శాతం మందికి కరోనా వైరస్ సోకినట్లు సర్వేలో తేలింది. దేశంలో కరోనా వైరస్‌ ప్రారంభమై దాదాపు ఆరు నెలలు గడుస్తోంది. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఇన్ని నెలల్లో 23.48 శాతం మంది కరోనాకు గురయ్యారని అని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. 
 
ఢిల్లీ జనాభాలో 1.9 కోట్లలో 23శాతం అంటే దాదాపు 44.61 లక్షల మందికి కరోనా సోకినట్లే. దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రెండు రోజుల కిందట చేసిన ప్రకటనకు ఢిల్లీ సర్వే బలం చేకూర్చేలా ఉంది.  
 
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఢిల్లీ ప్రభుత్వం కలిసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జూన్‌ 27 నుంచి జూలై 10 మధ్య దశల వారీగా 21,387 మందికి పరీక్షలు చేశారు. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఢిల్లీలో 23శాతం మంది ఇటీవల కాలంలో కరోనా బారిన పడినట్లు తేల్చారు.
 
ఆరునెలల వ్యవధిలో23 శాతం మందికి మాత్రమే వైరస్‌ సోకిందని, వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలే కారణమని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొచ్చింది.

ఢిల్లీ జనాభాలో కేవలం 23.48శాతం మందికే వైరస్‌ సోకిందని చెబుతున్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని అభిప్రాయపడింది. మిగతా జనాభాకు వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నందున మరింత జాగ్రత్త ఉండాలని సూచిస్తోంది. కరోనా కట్టడికి మరింత చర్యలను కొనసాగించాలని అధికారులకు సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు