రాష్ట్ర మొత్తం కూలగొట్టి కడతారా అంటూ హేళన చేశారు :: సీఎం కేసీఆర్

ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (16:40 IST)
తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని, రాష్ట్రం మొత్తం కూలగొట్టి కడతారా అంటూ హైళన చేసారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త సచివాలయ ప్రారంభం తన చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
'గాంధీ మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ జోహార్లు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 వల్లే రాష్ట్రం వచ్చింది. ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నాం. నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టుకోవడం గర్వకారణం. దీని నిర్మాణంలో అందరి కృషి ఉంది. సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలూ వెలుగుతున్నాయి. ప్రపంచ ఇంజినీరింగ్‌ అద్భుతాలు అనేలా చాలా ప్రాజెక్టులు కట్టుకున్నాం. కొత్త సచివాలయ ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థకు, నిర్మాణంలో చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు అని అన్నారు 
 
తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారు. రాష్ట్రం మొత్తం కూలగొట్టి కడతారా అంటూ హేళన చేశారని గుర్తు చేశారు. విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం. ప్రస్తుతం సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకెళ్తోంది. ఐటీలో బెంగళూరును దాటి దూసుకుని పోతుందన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమే అని చెప్పారు. ఇప్పుడు యాదాద్రి.. భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోందని చెప్పారు. కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం, వలసలు వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం రాష్ట్ర పునర్నిర్మాణమే. కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలవెత్తు సాక్ష్యం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు