ఆర్థిక కష్టాలు... పురుగుల మందు తాగిన చిట్యాల్ సీఐ...

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (07:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సాయి రమణ పురుగుల మందు తాగారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వరంగల్‌ కేయూసీ ఫిల్టర్ బెడ్ సమీపంలో ఆయన.. తన కారులోనే పురుగుల మందు తాగారు. దీంతో ఆయన అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. 
 
ఇంతలో అటుగా బ్లూకోల్ట్ పెట్రోలింగ్ సిబ్బంది అపస్మారకస్థితిలో కారులో పడి వున్న వ్యక్తిని గమనించారు. అదేసమయంలో సీఐకి ఫోన్ రావడంతో పోలీసులు మాట్లాడటంతో ఆయన చిట్యాల సీఐ అని తెలిసింది. దీంతో వెంటనే ఆయనను హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. 
 
కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సీఐ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రమణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వెంటనే హన్మకొండ వచ్చి చికిత్స పొందుతున్న సీఐని పరామర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు