ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు 24 గంటల పాటు తెరిచివుంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల నాలుగో తేదీన జీవో జారీచేసింది. అయితే, దుకాణాలను24 గంటల పాటు తెరిచిపెట్టుకునే నిబంధన అన్నింటికీ వర్తించదని స్పష్టంచేసింది. ముఖ్యంగా, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కింద వచ్చే దుకాణాలను ఈ జీవో వర్తించదని తెలిపారు.
తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 కింద పేర్కొన్న దుకాణాలు, సంస్థలకు సెక్షన్ 7 (దుకాణాలు తెరవడం, మూసివేసే గంటలు) నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా ప్రభుత్వం విధించింది. ఆయా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, దుకాణదారులు తమ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వారంతపు సెలవులు ఇవ్వడంతో పాటు వారికి పని గంటలు కూడా నిర్ధేశించాలి. షిఫ్ట్‌కు మించి పని చేస్తే ఎన్ని గంటలు పని చేసిందీ లెక్కగట్టి అదనపు వేతనం చెల్లించాలి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాణి కుముదిని మరింత స్పష్టతనిచ్చారు. జీవో నంబరు 4 కింద ఇచ్చే 24 గంటలు దుకాణాలను తెరిచిపెట్టుకునే నిబంధన ఆటోమేటిక్‌గా అన్నింటికీ వర్తించదన్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే దుకాణాలను 24 గంటలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయతే, ఈ జీవో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలకు వర్తించదని తెలిపారు. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం టీఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టలరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు ప్రత్యేక సమయం ప్రకారం మాత్రమే తెరిచి ఉంటాయని రాణి కుముదిని విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.