భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, అప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గ్రామ స్థాయిలో మలేరియా, డెంగీ, టెస్టింగ్ కిట్లతోపాటు కోవిడ్ పరీక్షల కోసం ర్యాపిడ్ కిట్లను, జిల్లా దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయన్నారు.
బూస్టర్ డోస్ పంపిణీని వేగవంతం చేసి నెల రోజుల్లోగా పూర్తిచేసేలా అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా బూస్టర్ డోస్‌లు వేయాల్సి ఉన్నదన్నారు. రెండో డోస్ వేసుకొని 6 నెలలు దాటినవారిలో ప్రతిరక్షకాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున అందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.