తెలంగాణ చరిత్రలోనే కాకుండా, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఎన్నడూ లేనంతగా ఒకేసారి 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఇవే కాకుండా 11 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులనూ క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.
ఈ మొత్తం ఉద్యోగాల ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు, వెంట వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఎంతో కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రత్యక్ష నియామక విధానంలో భ ర్తీ చేసే పోస్టుల ఖాళీలు మొత్తం 91,142 ఉన్నట్లు, వీటిలో 80,039 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మిగిలిన 11,103 పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న 11,103 మందిని క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ, యూనిఫాం సర్వీసులు మినహా ఇతర అన్ని ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచనున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం వల్ల ఓసీలు 44 ఏళ్ల దాకా, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 49 ఏళ్ల వరకు, దివ్యాంగులు 54 ఏళ్ల దాకా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కలిగి ఉంటారన్నారు.