17మంది మహిళల హత్య.. తెలంగాణ సీరియల్ కిల్లర్‌కు జీవిత ఖైదు
శనివారం, 28 మే 2022 (12:19 IST)
తెలంగాణలో నరరూప రాక్షసుడికి జీవితఖైదును విధిస్తూ గద్వాల న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ 17మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్‌కు గద్వాల కోర్టు జీవితఖైదు విధించింది.
వివరాల్లోకి వెళితే.. కల్లు తాగేందుకు వెళ్లిన మహిళలతో మెల్లగా మాట కలిపే ఎరుకలి శ్రీను (47).. వారిని నమ్మించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. వారిని హతమార్చి.. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తస్కరించేవాడు.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మహిళలను బలితీసుకున్నాడు. అలాంటి నరరూప రాక్షసుడికి గద్వాల కోర్టు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి యావజ్జీవ శిక్ష విధించారు.
ఇతనికి నేర చరిత్ర వుంది. 2007లో సొంత తముడిని హతమార్చి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకొచ్చాక ప్రవర్తన మార్చుకోకపోగా.. నేరాలు చేయడాన్నే వృత్తిగా మార్చుకున్నాడు. రంగారెడ్డి జిల్లాకు మకాం మార్చిన శ్రీను.. కల్లు కాంపౌండ్లకు వచ్చే మహిళలను టార్గెట్ చేసి వారిని మట్టుబెట్టేవాడు.
2018 ఆగస్టులో చివరిసారిగా జైలు నుంచి బయటకొచ్చాడు. జీవనోపాధి చూపిస్తే అతడు మారతాడనే ఉద్దేశంతో అధికారులు జిల్లా జైల్లోని పెట్రోల్ బంక్‌లో పని చేసే అవకాశం కల్పించారు. కానీ అతడి తీరు మారలేదు.
ఈ క్రమంలోనే 2019 డిసెంబరు 17న దేవరకద్ర మండలం డోకూరు సమీపంలో ఓ మహిళ డెడ్ బాడీని గుర్తించారు. పోలీసుల విచారణలో ఈ హత్య శ్రీనునే కారణమని తేలింది. ఈ క్రమంలో శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.