కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది. ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు, సూచనల మేరకు ఈ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
కరోనా వైరస్‌కు ముందు కేవలం మూడు పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. మార్చి 19వ తేదీన ఈ పరీక్షలు ప్రారంభంకాగా, ఆ తర్వాత మూడు పరీక్షలు జరిగాయి. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో పరీక్షలను వాయిదావేశారు.
ఇపుడు మిగిలిన 8 పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న గణితం పేపర్-1, 17న గణితం పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి.
అలాగే, జూలై రెండో తేదీన ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్ (సంస్కృతం అబిక్), జూలై 5వ తేదీన ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ రెండో పేపర్ (సంస్కృతం అబిక్), ఒకేషనల్ కోర్సు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 వరకు, ఒకేషనల్ థియరీ పేపర్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది.