నిరుద్యోగులకు తీపి కబురు.. త్వరలో అధ్యాపకుల పోస్టుల భర్తీ

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (17:43 IST)
నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. త్వరలో అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సభలో సభ్యులు అధ్యాపక నియామకాల గురించి ప్రశ్న అడగగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో గల వర్సిటీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలో వర్సిటీలకు వీసీలు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. 
 
తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ బిల్లుపై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జవాబిచ్చారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలకు సంబంధించి 16 ప్రతిపాదనలు రాగా, 8 ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. వాటిలో ఐదింటికి ఆమోదం కూడా తెలిపామని మంత్రి సబితా వివరించారు. మరో మూడింటికి త్వరలోనే ఆమోదం లభిస్తుందని చెప్పారు. 
 
కాలానుగుణంగా ప్రైవేటు వర్సిటీల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందన్నారు. దేశవ్యాప్తంగా 53 సెంట్రల్ వర్సిటీలు, 412 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 361 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 124 డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు