రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే పాక్షిక లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా 3,307 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 897 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,08,396 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,788కిగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 27,861 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 18,685 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 446 మందికి కరోనా సోకింది.