ఆంధ్రాలో ఆరు జిల్లాల్లో కరోనా పంజా : హెచ్చరించిన మంత్రి

గురువారం, 15 ఏప్రియల్ 2021 (11:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా, ఆరు జిల్లాల్లో ఈ వైరస్ తీవ్రంరూపం దాల్చింది. మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
 
గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో వైద్య మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. 
 
రానున్న ఆరు వారాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని... గతం కంటే ఎక్కువ వేగంతో కరోనా విస్తరిస్తుందని చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. ఏలూరులో ఒక్కరోజే 40 కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
 
మరోవైపు, తెలంగాణాలో కూడా భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,307 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 897 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,08,396 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,788కిగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 27,861 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 18,685 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు