తెలంగాణలో చిల్లర కొరత.. మద్యం బాటిళ్లపై రూ.5 పెంపు.. చిల్లర నాణేలతో వ్యాపారం..

శనివారం, 3 డిశెంబరు 2016 (19:34 IST)
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య తీర్చేందుకు తెలంగాణ సర్కారు రంగంలోకి దిగింది. పెద్ద నోట్ల రద్దుతో మందుబాబులపై ప్రభావం పడింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రూ.5తో చిల్లర సమస్య తలెత్తకుండా ఒక చిత్రమైన నిర్ణయం తీసుకుంది. లోక్లాస్‌ మద్యం రేట్లను ఏకంగా రూ.5 పెంచి చిల్లర సమస్య రాకుండా లెక్క సమం చేసింది. రూ. 75 నుంచి రూ. 215 వరకు ఉన్న మద్యం బాటిళ్ల ఖరీదును రూ. 5 చొప్పున ఎక్సైజ్‌శాఖ పెంచేసింది. 
 
అదేవిధంగా బీరు సీసాల ధరల్లోనూ ఇలాగే సవరణ చేసింది. దీంతో రూ. 105 ఉన్న బీరును ఇకపై రూ.110కి అమ్మనున్నారు. చిల్లర సమస్య తీర్చాలంటూ మద్యంషాపుల అసోసియేషన్‌ కోరడంతో ఎక్సైజ్‌శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
 
మరోవైపు.. చిల్లర నాణేలతో కమీషన్ వ్యాపారాలు చేస్తున్న కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంబర్‌పేట నియోజక వర్గంలో చిల్లర నాణేల వ్యాపారులు కమీషన్ల పేరుతో చిరువ్యాపారులను దోచుకుంటున్నారు. బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి చిల్లర నాణేలను తీసుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో నిత్యం రూ.5 కోట్ల వరకు చిల్లర నాణేల వ్యాపారం జరుగుతోందని అంచనా. చిల్లర నాణేల చెలామణి తక్కువగా ఉండడంతో నూటికి రూ.8 నుంచి రూ.10 శాతం కమీషన్ ఇచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు కొందరు వ్యాపారులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి