కేసీఆర్ ను దేవుడిగా భావించే... అలా..

శనివారం, 7 సెప్టెంబరు 2019 (09:21 IST)
కేసీఆర్ ను దేవుడిగా భావించి శిల్పులు ఆయన చిత్రాన్ని స్తంభాలపై చెక్కారని యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులలో శిల్పాలు, కళాకారుల పనులను పర్యవేక్షిస్తున్న సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, యాదాద్రి ప్రత్యేక అధికారి కిషన్ రావు చెప్పారు.

యాదాద్రి ఆలయంపై తెలంగాణ సీఎం కేసీఆర్, తెరాస పార్టీ కారు గుర్తులను చెక్కడంపై వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వివాదంపై ఆలయ అభివృద్ధి పనులలో శిల్పాలు, కళాకారుల పనులను పర్యవేక్షిస్తున్న సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, యాదాద్రి ప్రత్యేక అధికారి కిషన్ రావు ఆలయపనులలో శిల్పాలను పరిశీలించారు.

అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ.. శిలలపై రాజకీయ ప్రతిమలు చెక్కారా? లేదా అన్నది పరిశీలించామని, ఏ ఆలయంపైనైనా ఆనాటి పరిస్థితులను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సహజమేనని, ఇది ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కాదన్నారు.

అహోబిలం శిలలపై నెహ్రు, గాంధీ బొమ్మలు ఉన్నాయని, ఇక్కడ కెసిఆర్ కోసం చెక్కించామనడం సరికాదని, అభ్యంతరాలుంటే సరిచేస్తామన్నారు. కెసిఆర్, కారు ప్రతిమలు కేవలం బాహ్య ప్రకారంలో మాత్రమే ఉన్నాయని, ఇవి చెక్కాలని శిల్పులకు ఎవరూ చెప్పలేదని, సీఎంను దేవుడిగా భావించి వారే ప్రతిమలను చెక్కారన్నారు.
 
ఆయన నిజమైన భక్తుడనే చెక్కా
సమకాలీన చరిత్రను భావితరాలకు అందించే కార్యక్రమంలో భాగంగానే కారును యాదాద్రి ఆలయ స్తంభాలపై చెక్కానని శిల్పి హరిప్రసాద్‌ వివరణ ఇచ్చారు. కేసీఆర్‌ను నిజమైన భక్తుడిగా చూశానని, ఆయన చిత్రాన్ని స్తంభంపై చెక్కడంలో తనకు ఎలాంటి తప్పూ కనిపించలేదని స్పష్టం చేశారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ(వైటీడీఏ) కోరితే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా మార్పులు చేస్తానని చెప్పారు. యాదాద్రి ఆలయంలో కేసీఆర్‌ చిత్రంపై దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆయన వైటీడీఏకు ఈ-మెయిల్‌ పెట్టారు. ‘‘యాదాద్రి ఆలయ వాయువ్య, ఆగ్నేయ బాహ్య ప్రాకారాల బలపాదం స్తంభాలపై చెక్కిన చిత్రాలను పంపిస్తున్నా. వాటిని గమనించండి.

తెలంగాణ ప్రభుత్వ చిహ్నాలను, ఆలయ నవీకరణ జరిగిన కాలాన్ని ప్రతిబింబించే సమకాలీన ఇతివృత్తాలను, తద్రూపమైన చిహ్నాలను స్తంభాలపై చెక్కాం. ఓ వెయ్యేళ్ల తర్వాత భావి తరాలకు చరిత్రను అర్థం చేసుకోవడానికి ఇవి నిర్దేశకంగా ఉపయోగపడతాయి. మాకు వేరే ఉద్దేశం లేదు. పార్టీలపట్ల మొగ్గులేదు.

కృష్ణదేవరాయల కాలం నుంచీ ఈ సంప్రదాయం ఉంది. తిరుపతిలో రాయల కంచు విగ్రహం ఉంది. అహోబిళం ముఖ మంటప ఆలయంలోని భారీ స్తంభాలపై కృష్ణదేవరాయలు, బుక్కరాయలు నిలువెత్తు బొమ్మలను చెక్కారు. ఇటీవలి కాలంలోనూ చెప్పుకోవడానికి ఉదాహరణలు ఉన్నాయి.

శ్రీశైలంలోని భ్రమరాంబ ఆలయంలో, మహానంది రామాలయంలో, బ్రహ్మంగారి మఠంలో దేశంలోని గొప్ప నేతల చిత్రాలను, జాతీయ చిహ్నాలను, చివరకు మా నాన్నగారు, ఆయన పూర్వీకుల చిత్రాలను చెక్కారు. కేసీఆర్‌ సర్‌ నిజమైన భక్తుడు. అందుకే ఆయన చిత్రాన్ని ఎంచుకోవడంలో నాకేమీ తప్పు కనిపించలేదు.

కారును పార్టీ గుర్తుగా చెక్కలేదు. వాహనాల వరుసలో ఎడ్లబండి, రిక్షాతో పాటుగా కారును చెక్కాం. ఇంకా కొన్ని చెక్కాల్సి ఉంది. ఇక నుంచి మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తాను. మార్పులేవైనా చేయమంటే చేస్తాను. కృతజ్ఞతలతో విశ్వసనీయుడు హరిప్రసాద్‌’’ అని వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు