కోడలుకు నీతులు చెప్పిన అత్తా ఏదో చేసిందన్నట్టుగా వుంది... ఈటలపై తెరాస ఫైర్

శనివారం, 5 జూన్ 2021 (09:36 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పాటు.. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెరాస నేతలు మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. కోడలుకు నీతులు చెప్పిన అత్తా ఏదో చేసిందన్నట్టుగా ఈటల వ్యవహారం ఉందని వారు వ్యాఖ్యానించారు. ఆస్తిపన్ను చెల్లించేవారికి, ధనవంతులకు, బెంజ్ కార్లలో తిరిగేవారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేయవద్దని సీఎం కేసీఆర్‌కు చెప్పానంటున్న ఈటల.. ఇప్పటిదాకా కుటుంబసమేతంగా పంటసాయం పొందుతున్నారని తెరాస నేతలు ప్రకటించారు. 
 
పైగా, గత మూడేళ్ళలో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురి ఖాతాల్లో రూ.10.24 లక్షలు ప్రభుత్వం నుంచి జమ చేసిందని ఆధారాలతో సహ బహిర్గతం చేశారు. పుట్టు కోటీశ్వరుడిగా చెప్పుకుంటున్న ఈటల ఏటా రూ.3 లక్షలు ఎలా తీసుకుంటున్నాడని.. ఏనాడైనా వాటిని వద్దన్నాడా? అని సొంత తెరాస నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 
 
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో ఈటల రాజేందర్‌ కుటుంబసభ్యుల పేరిట ఉన్న 65 ఎకరాల భూమికి రైతుబంధు అందుతున్నదని, ఈటలతోపాటు, భార్య జమున, కుమారుడు నితిన్‌రెడ్డి ఖాతాల్లో 2018 నుంచి రైతుబంధు నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. 
 
ఆ ప్రకారంగా ఇప్పటివరకు రూ.10.24 లక్షలు పంట సాయం అందింది. కానీ, ముగ్గురు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి ఖాతాల్లో మూడు లక్షల రూపాయల చొప్పున మూడేండ్లుగా జమ అవుతున్నా.. ఈటల రాజేందర్‌ ఒక్కసారి కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని వారు గుర్తుచేశారు. 
 
తనకు పంటసాయం వద్దని చెప్పలేదు కదా మూడు దశాబ్దాల నుంచే వ్యాపారరంగంలో ఉన్నానని.. అప్పటికే తాను కోటీశ్వరుడినని చెప్పుకుంటున్న ఈటల.. రైతుబంధు సాయాన్ని తిరిగి ఇచ్చి మిగిలిన పెద్ద, ఆదాయపన్ను చెల్లించే రైతులకు ఎందుకు ఆదర్శంగా నిలవకలేకపోయారో చెప్పాలనే డిమాండ్‌ చేస్తున్నారు. మీడియా ముందు నీతులు చెప్పడం, ఉదాత్తవాదినని, పేదల గురించి ఆలోచించే వ్యక్తినని చెప్పడం 'కోడలుకు నీతులు చెప్పిన అత్తా ఏదో చెసింది అన్నట్టుగా ఉన్నదని' వారు ఎద్దేవా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు