తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తన ఉద్యమ సహచరుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. తెరాస పార్టీకి, తన శాసనసభ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసిన ఆయన... కేసీఆర్ నియంతృత్వ ధోరణిని ఎండగట్టారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తెరాస పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెరాస హైకమాండ్ కుట్రలను ఛేదిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. పార్టీతో తనకేకాకుండా మంత్రి హరీశ్ రావుకు కూడా గ్యాప్ వచ్చిందన్నారు.
హరీశ్ రావు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తనకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావుకు కూడా అవమానం జరిగిందని తెలిపారు. ఐదేళ్ల క్రితమే తనకు తెరాసకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు గ్యాప్ వచ్చిందని చెప్పారు.
కేసీఆర్ ఉండే నివాసం ప్రగతి భవన్ కాదని... అదొక బానిసల నిలయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బానిస కంటే అధ్వానంగా ఉన్న మంత్రి పదవి తనకెందుకన్నారు. మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని... 19 ఏళ్లుగా టీఆర్ఎస్‌లో ఉన్న తనను కూడా అగౌరవపరిచారని మండిపడ్డారు.
కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే... గేటు వద్దే తనను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పార్టీల్లాంటిది తెరాస కాదని... ఎంతో మంది ఉద్యమకారుల త్యాగఫలంతోనే తెరాస అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం తెరాసకు ఏమొచ్చిందని ఈటల ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను తాను ఏనాడూ వ్యతిరేకించలేదని... అయితే, బెంజ్ కార్లలో తిరిగే వారికి కూడా రైతుబంధు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించానని చెప్పారు.
తనది నక్సలైట్ అజెండా అని కేసీఆర్ చెప్పుకున్నారని... కానీ, వరవరరావును జైల్లో పెడితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఈటల విమర్శించారు. సింగరేణి బొగ్గుగని సంఘాన్ని తాను పెట్టిస్తే, ఇప్పుడు దాన్ని కవిత నడుపుతున్నారని... ఆర్టీసీ యూనియన్‌ను తాను, హరీశ్ రావు పెట్టిస్తే, ఇప్పుడు అది కవిత ఆధ్వర్యంలో ఉందని దుయ్యబట్టారు.
మంత్రుల మీదే నమ్మకంలేని కేసీఆర్‌కు... నాలుగు కోట్ల ప్రజలను పాలించే హక్కు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. సమ్మెలు చేయకుండా ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అడ్డుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అంటూ ఈటల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు. ఇపుడు సమ్మెలు చేసినా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆరోపించారు. మంత్రులు డమ్మీలుగా మారారని... ఆర్థికశాఖ సమీక్షల్లో ఆర్థిక మంత్రి కూడా ఉండని పరిస్థితి ఉందని అన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటల చెప్పారు.
ఆర్థిక మంత్రిగా తాను ఉన్నప్పుడు తాను చేసిన సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం తన తప్పా? అని ప్రశ్నించారు. కుక్కిన పేనులా ఉండకపోవడం వల్లే తనపై తెరాస హైకమాండ్‌కు కోపం వచ్చిందన్నారు. నీచపు వార్తలతో ప్రజలకు తనను దూరం చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రజలు అహింసాయుతంగా నిరసన తెలిపే ధర్నాచౌక్‌ను కూడా ఎత్తేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మండిపడ్డారు.
హుజురాబాద్ నియోజక వర్గంలో తాము ప్రతి కార్యకర్తతో కలిసి మెలసి ఉండేవారమని చెప్పారు. 'అటువంటి హుజురాబాద్ నియోజక వర్గంలో ఈటల రాజేందర్‌ను ప్రాణం ఉండగానే బొంద పెట్టారు. బతికి ఉండగానే నన్ను బొంద పెట్టాలని సీఎం ఆదేశించడంతోనే ఇలా చేస్తున్నారు. హుజురాబాద్‌లోని నాయకులకు డబ్బుల ఆశను చూపెడుతూ, మభ్యపెడుతున్నారు. అదీ కాకపోతే అనేక రకాలుగా ఇక్కడి ప్రజాప్రతినిధులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ ఫర్వాలేదు. హుజురాబాద్ నియోజక వర్గంలో తెరాసను బలపర్చింది ఈటల రాజేందర్ మాత్రమే' అని ఈటల రాజేందర్ తెలిపారు.
'ఇన్నాళ్లు నాతో కలిసి మెలసి తిరిగిన వారు నాపైనే కుట్రలు పన్నుతున్నారని నాతో ఈ ప్రాంత ప్రజలు అన్నారు. నువ్వు ఎట్ల తట్టుకోగలుగుతున్నావు బిడ్డా అని నన్ను అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద జరుగుతోన్న దాడి, కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తాం అని నాతో నా నియోజక వర్గ ప్రజలు చెప్పారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు. నాపై జరుగుతోన్న కుట్రలు చూసి, నన్ను బర్తరఫ్ చేయడం చూసి హుజురాబాద్ ప్రజలంతా ఏదో కోల్పోయినట్లు భావించారు' అని ఈటల రాజేందర్ వివరించారు. అందుకే 19 ఏళ్ల టీఆర్ఎస్ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.