తెలంగాణా రాష్ట్రంలో సోమవారం వెల్లడికావాల్సిన ఇంటర్ పరీక్షా ఫలితాలు వాయిదాపడ్డాయి. అనివార్య కారణాల రీత్యా వాటిని మంగళవారానికి వాయిదావేశారు. ఈ విషయాన్ని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వాస్తవానికి ఈ ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సివుంది. కానీ, అనివార్య కారణాల వల్ల పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి.
ఇదిలావుంటే, నిజానికి పరీక్షలను నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేసిన క్రమంలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్‌లో ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే సెకండ్ ఇయర్‌కి కూడా కేటాయిస్తామని ఇప్పటికే తెలిపారు.
ఇక ప్రాక్టికల్స్‌లో అందరికీ 100 శాతం మార్కులు ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం.. ఆయా సబ్జెక్టులకు 35 శాతం మార్క్స్ కేటాయించనున్నారు. ఇక ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.