ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

శుక్రవారం, 10 జులై 2020 (12:04 IST)
తెలంగాణ సర్కారు ఇంటర్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను కేసీఆర్ సర్కారు రద్దు చేసిన తరుణంలో.. తాజాగా తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 
 
ఈ ఏడాది సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు ఫెయిల్‌ అయిన విద్యార్థులను కంపార్ట్‌మెంట్‌ పాస్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 'ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 1.47 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. సెకండియర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను కంపార్టమెంట్‌ పాస్‌ చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
 
జూలై 31 తర్వాత వారి మార్కుల మెమోలు సంబంధిత కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్ధులు పై చదువులు చదివేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పదవ తరగతితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఫస్టియర్ విద్యార్ధులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? అనేది స్పష్టం చేయలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు