ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు కాసుల వర్షం.. ఎందుకో తెలుసా?

ఆదివారం, 25 అక్టోబరు 2020 (09:39 IST)
దసరా పండుగ వేళ ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు కాసుల వర్షం కురుస్తోంది. దీనికి కారణం ఇరు రాష్ట్రాల అధికారుల మంకుపట్టే. ఫలితంగా పండుగ వేళ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే... ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం రెండు చేతులా సంపాదిస్తున్నారు.
 
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే రూట్లపై గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొంది. ఇదే అంశంపై ఇరు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఇదే ప్రైవేటు ఆపరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
అదేసమయంలో దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. ఏపీకి వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. దసరా పండగకు సరాదాగా ఇంటికి వెళ్దామనుకునే ఏపీ ప్రజలకు ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు అయ్యే ఖర్చుల కంటే.. సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాలకు చెల్లించే ఖర్చులు అధికంగా ఉంటున్నాయని వాపోతున్నారు. 
 
గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 1,500ల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించేవి. లాక్డౌన్ తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య తిరిగి అంతరాష్ట్ర సర్వీసులు పునరుద్ధరించకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 
 
పండగ వేళ హైదరాబాద్ - విజయవాడ, విశాఖపట్టణం మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ఈ మార్గాల్లో ప్రైవేటు బస్సుల వారు గరిష్ఠంగా రూ.1600 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ - బెంగళూరుకు 2,150 వరకు దండకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. కొలిక్కి వచ్చేదెప్పుడో... అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై అధికారులు నాలుగైదు సార్లు సమావేశమైనా సమస్య పరిష్కారం కాలేదు. 
 
మొదటి సమావేశంలో 2 లక్షల 60 వేల కిలోమీటర్లు తిప్పుతామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు టీఎస్​ఆర్టీసీకి ప్రతిపాదించారు. ఆ తర్వాత సమావేశాల్లో 2 లక్షల 8 వేల కిలోమీటర్లు తిప్పుతామని చెప్పినా టీఎస్‌ఆర్టీసీ అంగీకరించలేదు. టీఎస్​‌ఆర్టీసీ... ఏపీలో లక్షా ‌60 వేల కిలో మీటర్లు తిప్పినప్పుడు.. ఏపీఎస్​ ఆర్టీసీ కూడా తెలంగాణాలో లక్షా అరవైవేల కిలోమీటర్లు మాత్రమే‌ తిప్పాలని స్పష్టం చేసింది. 
 
అందుకు ఏపీ అంగీకరించినప్పటికీ హైదరాబాద్‌ - విజయవాడ రూట్‌పై స్పష్టత లేకపోవడంతో బస్సులు ప్రారంభంకాలేదు. ఏపీఎస్​ ఆర్టీసీ మొండిగా వ్యవహరించడం వల్లే సమస్య పరిష్కారం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి అజయ్‌ కుమార్‌ ఆరోపిస్తున్నారు. 
 
తాత్కాలికంగానైనా నడపాలి పండగ పూట బస్సులు నడవకపోవడం ఇరు రాష్ట్రాలకు నష్టమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సరిహద్దుల వరకు వెళ్లి... మళ్లీ బస్సులు మారడం వల్ల నానా అవస్థలు పడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టువిడుపులు మాని పండగకు తాత్కాలికంగా బస్సులు నడపాలని కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు