నేడు తెలంగాణాలో భారీ వర్షాలు - ఎల్లో అలెర్ట్ జారీ

మంగళవారం, 11 అక్టోబరు 2022 (08:57 IST)
నైరుతి రుతుపవన కాలం ముగిసిపోనుంది. ఈ రుతుపవాలు వెళుతూ వెళుతూ రెండు తెలుగు రాష్ట్రాలపై పగబట్టినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. 
 
మంగళవారం భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు... తెలంగాణాకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణాలోని పశ్చిమ, ఉత్తర జిల్లాలకు వాతావరణ కార్యాలయం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. 
 
తుఫాను ప్రభావంతో తెలంగాణాలో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ వారంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. 
 
మరోవైపు పసిఫిక్ మహా సముద్రంలో లానినా ప్రభావం కొనసాగుతోంది. దీంతో సముద్రం నుంచి తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి. కాగా, ఏపీలో నిన్న పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు