హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం అయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అభిమానులతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కేవలం 300 మంది కీలక నేతలతో సమావేశం కావాలని అనుకున్నా..దాదాపు 500 మంది హాజరయ్యారని సమాచారం. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినవి చేస్తుందా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా? అని షర్మిల నిలదీశారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై మాట్లాడదామని అభిమానులతో షర్మిల తెలిపారు. 11 ప్రశ్నలతో ఫీడ్‌బ్యాక్ ఫామ్ నింపాలని అభిమానులను కోరారు షర్మిల.
కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నింటికీ అతీతంగా వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలను ప్రేమించారు. రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ప్రాణం పోయిందని తెలుసుకుని చనిపోయిన వారిలో తెలంగాణ వారు కూడా ఉన్నారు.
రాజన్న సంక్షేమ పాలన ఇక్కడ రావాలని, తేవాలని నా కోరిక. మీరు తోడుంటే..అది సాధ్యమని నమ్మకం. మీ మీ ప్రాంతాల్లో మీకు తెలిసిన విషయాలు, టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది ? పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు ? మన వాళ్లు ఎలా ఉన్నారు ? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి ? తనకు తెలియచేయాలని సూచించారు.
షర్మిల అడిగిన ప్రశ్నల సంగతికి వస్తే :
తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటీ ?
మీ అసెంబ్లీ పరిధిలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటీ ?
రాజకీయ నిర్ణయంపై సామాన్యులు ఏమనుకుంటున్నారు ?
బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే.. పోరాడాల్సిన అంశాలు ఏంటీ ?
సంస్థాగతంగా బలపడడానికి క్యాడర్ నిర్మాణానికి చేయాల్సిన పనులు ఏంటీ ?
వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే.. మీరు ఇచ్చే సలహాలు ఏంటీ ?