తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లో జోరుగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ యేడాది ఆఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార భారత రాష్ట్ర సమితి(తెరాస)లో తన పార్టీని విలీనం చేస్తారని కొందరు, కాదు పొత్తుపెట్టుకుంటారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే, బీఆర్ఎస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
గురువారం ఆమె హైదరాబాద్ గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు పది ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో అవినీతి సొమ్మంతా సీఎం కేసీఆర్ వద్దే ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన అన్ని హామీలను సీఎం తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిదన్నారు. తన పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తారనని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలా మాట్లాడుతూ ఓ మహిళ కష్టాన్ని అవమానించవద్దని ఆమె హితవు పలికారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. అంతేకానీ, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. అదేసమయంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పొత్తులపై స్పష్టత ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. తాను ఇతర పార్టీలో చేరాలనుకుంటే పార్టీ పెట్టక ముందే చేరేదానిని అని, తాను చేరుతాను అంటే తనను పార్టీలో చేర్చుకోని పార్టీ అంటూ ఏదైనా ఉందా అని షర్మిల ప్రశ్నించారు.