తెలంగాణాలో నేడు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఆవిర్భావం...

గురువారం, 8 జులై 2021 (09:43 IST)
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తన తండ్రి జయంతిని పురస్కరించుకుని జూలై 8వ తేదీన తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
 
తన తండ్రి జయంతిని పురస్కరించుకుని తొలుత కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత తన కొత్త పార్టీ జెండాను సమాధిపై ఉంచి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. 
 
పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, సాయంత్రం ఐదు గంటలకు రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు.
 
వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. 
 
ఈ కార్యక్రమంలో తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితోపాటు కోర్ టీం సభ్యులైన కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు సభావేదికపై జెండా ఆవిష్కరణలో పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు