నక్కను తొక్కిన అమలాపాల్.. టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్

గురువారం, 30 మార్చి 2017 (04:24 IST)
దర్శకుడు విజయ్‌తో పెళ్లి పెటాకులయ్యాక ఇక తన పని అవుట్ అనుకున్న వారి అంచనాలను పటాపంచలు చేస్తూ అదృష్టపు బాటలో అవకాశాలను కొల్లగొడుతూనే ఉన్నారు మలయాళ కుట్టి హీరోయిన్ అమలాపాల్. పెళ్లి రద్దు షాక్ నుంచి బయటపడి త్వరగానే మళ్లీ నటనారంగంలోకి వచ్చిన అమలాపాల్ ఇప్పటికే తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. తెలుగులో ఆమె కనిపించి ఏళ్లు గడిచాయి. ఇప్పుడామెకు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ తలుపు తట్టి మరీ వచ్చింది.
 
గతంలో పూరీ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలు చిత్రంలో కథానాయికగా నటించిన అమలాపాల్ మళ్లీ పూరీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. అదేదో అల్లాటప్పా సినిమా కాదు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఘనవిజయంతో మంచి ఊపు మీద ఉన్న బాలకృష్ణ 101వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పూరీ జగన్నాథ్ తన సినిమాలో మళ్లీ అమలాపాల్‌కు కథానాయికగా బంపర్ అవకాశం ఇచ్చారు. 
 
ఇద్దరమ్మాయిలు సినిమాలో అమలా పాల్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీన్ని గుర్తుపెట్టుకుని ఉన్న పూరి బాలకృష్ణ సరసన అమలాపాల్‌కు కథానాయికగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పూరీ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక పూర్తియినట్లే. మరో కథానాయికగా ముస్కాన్‌ ఇప్పటికే ఎంపికైంది. వివాహ బంధం ముగిసిన తర్వాత మళ్లీ చిత్రసీమను నమ్ముకున్న అమలాపాల్ కెరీర్ గాడిలో పడినట్లే మరి.  
 

వెబ్దునియా పై చదవండి