'బాహుబలి 2' స్టోరీ లీక్.. సోషల్ మీడియాలో వైరల్.. కట్టప్ప ఎందుకు చంపాడంటే...
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (10:32 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి, ప్రభాస్, రానాలు, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్‌లు నటించిన 'బాహుబలి 2' చిత్రం. ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. అదేసమయంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేసమయంలో ఈ చిత్రం స్టోరీ ఇదేనంటూ ఓ కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'బాహుహలి పార్ట్-1'లో గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజమౌళి.. కట్టప్పతో ‘బాహుబలి’ని చంపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. 'బాహుబలి ది బిగినింగ్' విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా?' అని ఆలోచించడం మొదలుపెట్టారు. సగటు ప్రేక్షకుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ కన్‌క్లూజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోంది. సృష్టికర్తలెవరో తెలియదు కానీ... ఇదే ‘బాహుబలి కన్‌క్లూజన్’ అని నమ్మేలా ఉంది ఆ స్టోరీ. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సొచ్చిందో కూడా అందులో వివరించారు. ఆ స్టోరీ వివరాలను పరిశీలిస్తే...
గిరిజన రాజు కూతురైన దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె మహిష్మతి రాజ్యానికి రావడానికి నిరాకరిస్తుంది. దీంతో ఆమెను పెళ్ళి చేసుకుని అటవీ ప్రాంతంలోనే జీవిస్తుంటాడు. దీన్ని భల్లాల దేవుడు (రానా) ప్రోత్సహిస్తూ... దేవసేనతోనే ఉండేలా చేస్తాడు. కానీ రాజమాత రమ్యకృష్ణకు ఇష్టం ఉండదు. అదేసమయంలో ఆమెకు లేనిపోనివన్నీ చెప్పి నూరిపోస్తాడు భల్లాలదేవుడు.
తద్వారా రాజ్యపెత్తనం తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అక్కడి నుంచి బాహుబలి లేకుండా చేసేందుకు ప్రణాళికలు వేస్తాడు. ఇందుకోసం మహిష్మతి రాజ్యంలో తనకు నమ్మకస్తులైన సైన్యంతో గుట్టుచప్పుడు కాకుండా పలు అరాచకాలు చేయిస్తూ అవన్నీ ఆటవిక సైన్యం చేస్తోందనీ, వారికి బాహుబలి మద్దతు ఉందంటూ దుష్ప్రచారం చేస్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది.
కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈ లోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టటం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయనీ, ప్రజలు ప్రశాంతంగా ఉండలేక పోతున్నారంటూ రాజమాతను నమ్మిస్తాడు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవుడికి కూడా కావాల్సింది. దీంతో భల్లాలదేవుడు తన సైన్యంతో బయలు దేరుతాడు.
ఆ సమయంలో మహిష్మతి రాజ్య కోటకు మహామంత్రి కట్టప్ప (సత్యరాజ్) కాపలాగా ఉంటాడు. భల్లాలదేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురువెళతారు. బాహుబలిని చూడగానే మహిష్మతి సైన్యం రెండుగా చీలిపోతుంది. భల్లాలదేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం మరోవైపు.
ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది. రాజమాత ఆదేశంతో కట్టప్ప భారమైన మనసుతో రణభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటాడు.
బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాజమాత ఆజ్ఞ పాటిస్తాడు. అదేసమయంలో భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు.
అయితే, దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. నిజం తెలుసుకున్న రాజమాత పశ్చాత్తాపంతో కుంగిపోతుంది. పైగా, దేవసేన బిడ్డను కాపాడే బాధ్యతను తాను స్వీకరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భల్లాలదేవుడు, అతని తండ్రి బిజ్జల దేవుడు కలిసి ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భావిస్తారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని కోట నుంచి పారిపోతుంది.
ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. దీంతో రాజమాత దిక్కులేనిదిగా మారిపోతుంది. ఇదే అదునుగా భావించిన భల్లాల దేవుని అనుచరులు ఆమెను వెంటాడుతూ కొండ కిందివరకూ వస్తారు. రాజమాత వారి కంటికి కనిపించక పోవడంతో బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు.
మరోవైపు... మహిష్మతి రాజ్యం నడి వీధుల్లో దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు భల్లాల దేవుడు. ఇంకోవైపు తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండో బాహుబలి (దేవసేన కుమారుడు) సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.? మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.? దేవసేన రాజమాతగామారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా.... ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్ అంటూ సోషల్ మీడియాలో ఓ కథ వైరల్ అవుతోంది.