యాక్షన్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు జాకీచాన్. నటుడిగా కానీ, రాజకీయ నాయకుడిగా కానీ.. ఆయనది క్లీన్ ఇమేజ్. ఎప్పుడూ పాజిటివ్ విషయాలతోనే వార్తల్లో ఉండే జాకీ చాన్ గురించి తెలియని వారంటూ ఉండరు. అతను చేసే ఫైట్లు, కామెడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఒకవైపు చైనా సినిమాలు చేస్తూనే మరోవైపు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
జాకీచాన్ గొప్ప నటుడే కాదు.. అంతకుమించి మంచి వ్యక్తిత్వం ఉన్నవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్‌తో అభిమానులను ఆకట్టుకునే జాకీ చాన్ నటిస్తున్న చిత్రం ''కుంగ్ ఫూ యోగా''. ఇందులో ఇండియన్ సినీ స్టార్స్ సోనూసూద్.. దిశా పటానీ కూడా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో అతను ఎలా ఉంటాడో బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ చెబుతోంది.
ఈ సందర్భంగా జాకీచాన్ గురించి చెబుతూ.. ''జాకీచాన్ శాంటక్లాజ్లా అనిపిస్తాడు. రోజూ సెట్‌కి చాక్లెట్లు, కుకీలతో పాటు పలు రకాల తినుబండారాలు తెచ్చి అందరికీ పంచుతాడు. అందరితోనూ కలిసిపోతాడు. అందుకే అతనికి అంతమంచి పేరు వచ్చింది. జాకీచాన్ దయాహృదయం ఉన్న గొప్ప వ్యక్తి. మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడే ఆయనేంటో.. అంత గొప్ప నటుడు ఎలా అయ్యాడో తెలిసింది. ఆయన పనితనమే కాదు.. వ్యక్తిత్వం కూడా జాకీచాన్ పాపులారిటీకి దోహదపడింది'' అని దిశా పటానీ అంటోంది.