నందమూరి బాలకృష్ణ తన అభిమానిపై చేయి చేసుకున్నంత పని చేశాడు. తనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ అభిమానిపై వీరావేశంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఓ వెబ్‌సైట్ అప్‌లోడ్ చేయగా, ఇపుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మంచి విజయాన్ని సాధించింది.
ఈ క్రమంలో చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్‌కు వచ్చిన బాలయ్యతో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన బాలయ్య... ఆ అభిమాని చేయిపై కొట్టడంతో మొబైల్ ఫోన్ కిందపడిపోయింది. ఆ తర్వాత పక్కన వుండేవారు ఆ అభిమానిని వారించారు. అయితే, బాలయ్య మాత్రం వీరావేశంతో ఊగిపోతూ... అతని నానా మాటలు అంటున్నట్టుగా ఆ వీడియో ప్లే అవుతోంది.