ప్రభాస్ 'రాముడు' సరసన 'సీత'గా బాలీవుడ్ నటి ఫిక్స్?!

మంగళవారం, 25 ఆగస్టు 2020 (22:17 IST)
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న మరో భారీ ప్రాజెక్టు ఆదిపురుష్. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ ప్రాజెక్టును బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పట్టాలెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడుగా కనిపించనున్నారు. దీంతో ప్రభాస్ సరసన సీతగా ఎవరు కనిపిస్తారన్న చర్చ సోషల్ మీడియా వేదికగా సాగింది. ఈ పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారనే వార్తలు వినొచ్చాయి. 
 
అయితే, అలాంటిదేమీ లేదని ఆ తర్వాత తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ భామ కియరా అద్వానీ కోసం ఈ చిత్ర నిర్మాతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు, ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు వినికిడి. ఆమె ఎంపిక దాదాపు పూర్తయిందని కూడా కొందరు అంటున్నారు.
 
ఇదిలావుంచితే, ఈ చిత్రం షూటింగును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి ఏకధాటిగా రెండు నెలల చిత్రీకరణతో పూర్తి చేస్తామని దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. అయితే, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని, ఇందులో వాటి ప్రాధాన్యత ఎక్కువని ఆయన తెలిపారు. కాగా, ఇందులో విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు సయీఫ్ అలీ ఖాన్ పోషిస్తాడని ప్రచారం జరుగుతోంది. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు