హెల్త్ చెకప్‌ కోసం యుఎస్ వెళ్లనున్న 'తలైవా'.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంతేనా?

గురువారం, 29 జూన్ 2017 (13:16 IST)
కోట్లాది మంది అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలైవా (రజనీకాంత్) మరోమారు అమెరికా వెళ్లనున్నారు. తన ఆరోగ్య వైద్య పరీక్షల కోసం వచ్చే నెలలో అమెరికాకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఒక్క వార్తతో ఆయన రాజకీయ రంగ ఎంట్రీపై మళ్లీ చర్చ మొదలైంది. ఆరోగ్యం ఏమాత్రం సహకరించకుంటే రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి 2011లో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ సమయంలో తొలుత చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సింగపూర్‌కు వెళ్లి అక్కడ ఉన్న ప్రఖ్యాత మౌంట్‌ ఎలిజబెత్‌ హాస్పటల్లో చేరి పక్షం రోజులు వైద్య సేవలు పొందారు. అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో స్వదేశానికి తిరిగివచ్చారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి కొద్దిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాలైన పుకార్లు వినిపించగా, వాటిని కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. 
 
అక్కడ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఆయన "కబాలి" చిత్రంలో నటించారు. ఇపుడు "2.0" చిత్ర షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన మళ్లీ అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ఫలితంగా మళ్లీ అమెరికా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
రజనీకాంత్ ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కాలా" చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంటూ మరో వైపు తన రాజకీయ ప్రవేశంపై సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన బర్త్‌డే రోజు పార్టీ ప్రకటన ఉంటుందని తెలుస్తుండగా, 'కాలా' సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 10 నుండి చెన్నైలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనుందట. 
 
రజనీ మాత్రం జూన్ 12న టీంతో కలవనున్నట్టు సమాచారం. అయితే ఈ గ్యాప్‌లో తన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వారం రోజుల పాటు అమెరికా వెళ్ళనున్నారనే వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అక్కడ వైద్యులు ఇచ్చే సలహానుబట్టి ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి