సినిమాలు చేయకపోతే ఎలా? మనసు మార్చుకున్న పవన్? రెండు పడవలపై?

మంగళవారం, 22 ఆగస్టు 2017 (15:38 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2019 ఎన్నికలను టార్గెట్ చేసి పూర్తి స్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ సినిమాలను వదిలిపెట్టకూడదని డిసైడయినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఇటీవల ఓ వేదికపై పవన్ మాట్లాడుతూ.. ఇకపై తాను పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. అవసరమైతే సినిమాలను వదిలేస్తానని కూడా పవన్ ప్రకటించారు. దీంతో అందరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేసే సినిమానే చివరిదనుకున్నారు. 
 
కానీ ఇంతలో పవన్‌కు సన్నిహితులు హితవు పలికారు. ఇప్పటికిప్పుడు సినిమాలు వదులుకోవడం కరెక్ట్ కాదని తెలిపారట. పార్టీ కోసం నిధులు వసూలు చేసే ఆలోచన లేనప్పుడు.. సినిమాలు చేయకపోతే ఎలా..? అనే విషయాన్ని పవన్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. సినిమాలతోనే పవన్ కల్యాణ్‌కు క్రేజ్ వస్తుందని.. పార్టీని నడుపుతూ సినిమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళడమే ఉత్తమమని సన్నిహితులు పవర్ స్టార్‌కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ సినిమాలకు దూరం కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 
 
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలను చక్కబెట్టాలనే ఆలోచనలో పవన్ వున్నారని సినీ జనం అంటున్నారు. అయితే రెండు పడవలపై కాలు పెట్టి పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలు చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇకపోతే.. నంద్యాల ఉప ఎన్నికలను రాజకీయంగా బలపడేందుకు పవన్ ఉపయోగించుకుని వుండాల్సిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ పవన్ నంద్యాల ఎన్నికల్లో తటస్థంగా జనసేన వుంటుందని ప్రకటించడం ద్వారా ఆ ఎన్నికలకు కాస్త దూరమయ్యారనే చెప్పాలి.
 
ఈ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో జనసేన బరిలోకి దిగివుంటే ఫలితం ఏమాత్రమో మిగిలిన పార్టీలకు తెలిసిపోయేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన మంచి ఫలితాలను రాబట్టే అవకాశాలున్నట్లు వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు