ప్రియుడితో ప్రైవేసి కోసం విద్యాబాలన్ "గాలి"(లో) తిరుగుళ్లు

బుధవారం, 2 మే 2012 (15:54 IST)
"డర్టీ" హీరోయిన్ విద్యాబాలన్ తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థరాయ్ కపూర్‌తో కలిసి ఈ మధ్య విమానాల్లోని సాధారణ శ్రేణిలో చక్కర్లు కొడుతూ తోటి ప్రయాణికులకు ఝలక్‌లు ఇస్తోంది. సాధారణంగా టాప్ బాలీవుడ్ నటులు విమానాల్లో ప్రయాణించేటప్పుడు బిజినెస్ క్లాస్‌లో వెళ్లడమనేది ఆనవాయితీ. అందుకు భిన్నంగా విద్య బిజినెస్ క్లాస్‌కు బైబై చెప్పి సాధారణ తరగతి ప్రయాణికులతో కూర్చుని ప్రయాణించడం మొదలుపెట్టింది. 

పొదుపు చేసి నాలుగు డబ్బులు మిగుల్చుకునే ప్రయత్నమో మరేమిటో కానీ, సాధారణ ప్రయాణికురాలి అవతారం ఎత్తిన విద్యాబాలన్‌ను చూసి తొలుత.. "హా ఎవరో విద్యా బాలన్ లాంటి అమ్మాయి" కాబోలనుకుంటూ పట్టించుకోకపోయినా.. ఆమె వ్యవహారశైలి, మాట తీరును చూసి తమ సెల్ ఫోనుల్లో బంధించడానికి తోటి ప్రయాణికులు ఎగబడటం మామూలయిపోయింది.

ఇటీవల సిద్దార్థతో కలిసి గోవాకు వెళ్తున్న సమయంలో సాధారణ తరగతి సీట్లలో విద్యాబాలన్‌ను చూసిన ప్రయాణికులు ఫోటోలు తీయడానికి తోసుకోవడంతో, వారిని విద్య పదేపదే వారించాల్సి వచ్చింది. ఫోటోలు తీసి తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని సున్నితంగా హెచ్చరించడంతో అంతా ఎవరి సీట్లలో వాళ్లు కూర్చుండిపోయారు.

కానీ, ఒక పెద్దాయన మాత్రం వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడమెందుకనుకుంటూ తన కెమేరాను క్లిక్ చేయడం మానకపోవడంతో విద్య అతన్ని తీవ్ర స్వరంతో కఠువుగా హెచ్చరించాల్సి వచ్చింది. అంతేకాదు, అతగాడు తననూ.. తన బాయ్‌ఫ్రెండ్‌ను తీసిన ఫొటోలను కెమేరా నుండి తొలగించే వరకు స్వయంగా ఆమె ఊరుకోలేదు. అదే సమయంలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒకతను మాత్రం అసలు ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో నిజంగా అంత ప్రైవసీ కోరుకుంటే.. సాధారణ తరగతిలో ఎందుకు ప్రయాణిస్తోందని ప్రశ్నించడం విశేషం.

వెబ్దునియా పై చదవండి