భిన్నమైన టైటిల్స్
తూర్పుగోదావరి కోరుమామిడిలో 1956న జూన్10న జన్మించారు. రచనలు చేస్తూ విభిన్నమైన ఆలోచనలతో వున్న ఆయన దర్శకుడిగా మారాలని కోరిక బలంగా వుండేది. `చెవిలో పువ్వు` సినిమాతో దర్శకత్వం వహించారు. ఆ టైటిల్‌తోనే ఆయన ఆలోచన ఏమిటో అనేది సినిమా రంగం గ్రహించింది. డి.రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్, ఇ.వి.వి.ని దర్శకునిగా పరిచయం చేస్తూ చెవిలో పువ్వు నిర్మించారు. సినిమాలో అన్నీ అమరాయి. కానీ, సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. టైటిల్ దెబ్బ కొట్టింది అని పలువురు చెప్పారు. చెవిలో పువ్వు దర్శకత్వం వహించే సమయంలో ఎంతోమంది నిర్మాతలు ఇ.వి.వి.కి అడ్వాన్సులు ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడక పోయేసరికి, ఇ.వి.వి.ని చూడగానే ముఖం చాటేసేవారు. అలాంటి సమయంలో ఇ.వి.వి.ని ప్రోత్సహించింది రామానాయుడే. `ప్రేమఖైదీ` అనే సినిమాకు అవకాశం ఇచ్చారు. అది దిగ్వియాజన్ని సాధించింది. ఆయన ముందుగా టైటిల్స్‌ను విభిన్నంగా పెట్టాలని తపనపడతారు. ఆయనకు కొంతమంది రచయితలు పనిచేస్తుంటారు. అందులో ఇప్పటి దర్శకుడు వేగ్నేశ సతీష్ ఒకరు.
తన సినిమాలలో కామెడీకి పెద్ద పీఠ వేస్తారు. జంథ్యాల ఆయన గురువు. ఆయన తరహాలోనే సినిమాలు తీయాలని అనుకున్నా, అప్పటి ట్రెండ్‌ను బట్టి కొంచెం ద్వంద్వార్థాలు చొప్పించే విధంగా వుండేవి. అయితే అవి సామాన్యులు మాట్లాడుకునే భాష అని అనేవారు. ఆయన కామేడీ సినిమాలు ఎక్కువగా డా. రాజేంద్రప్రసాద్‌తోనే తీశారు. అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటివి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అన్నింటికంటే భిన్నమైన సినిమా `జంబలకిడి పంబ`. ఈ సినిమాలో మగవారు ఆడవారుగా మారితే ఎలా వుంటుందనేది భిన్నమైన ఆలోచన. ఇది అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. హాస్యంతోపాటు సెంటిమెంట్ ప్రధానంగా సినిమాలు తీసేవారు. ఆయనకు ఇద్దరు, ఏవండి ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, సీతారత్నంగారి అబ్బాయి, ఆమె, చాలా బాగుంది, ఆరుగురు ప్రతివత్రలు వంటి విభిన్నమైన కాన్సెప్ట్‌లు ఆయనకే చెల్లింది.
అగ్రహీరోలతోనూ తీశారు
అగ్రహీరోలు నాగార్జునతో `హలో బ్రదర్`, చిరంజీవితో `అల్లుడా మజాకా`, పవన్‌కళ్యాణ్‌తో `అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి`, వెంకటేష్‌తో ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు వంటి సినిమాలు తెరకెక్కించారు. జగపతిబాబు, శ్రీకాంత్, జెడి. చక్రవర్తి, మోహన్‌బాబులతోకూడా విజయవంతమైన సినిమాలు చేశారు. అలాగే ఆయన కుమారులు అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేష్‌లతో కూడా సినిమాలు తీశారు. `హలో` అంటూ రాజేశ్‌తో తీసినా పెద్దగా ఆడలేదు. నరేశ్‌తో విజయవంతమై సినిమాలు చేశారు. ఎవడిగోలవాడిదే, కితకితలు, అత్తిలి సత్తిబాబు, కత్తి కాంతారావు వంటి సినిమాలు చేశారు.
తండ్రి బాటలో
కాలక్రమేణా ఇ.వి.వి. మునుపటి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఆయన మరణం తర్వాత ఇ.వి.వి సినిమా పతాకంపై ఆ మధ్య నరేశ్ హీరోగా అతని అన్న రాజేశ్ బందిపోటు అనే చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ బందిపోటు జనాన్ని దోచుకోలేకపోయాడు. ఏది ఏమైనా ఇ.వి.వి. సత్యనారాయణ పేరు వినగానే ఆయన పండించిన నవ్వుల పువ్వులు ముందుగా గుర్తుకు వస్తాయి. తలచుకొనే కొద్దీ కితకితలు పెడుతూనే ఉంటాయి.