మట్టి నుంచి పుట్టిన సినిమా భీమదేవరపల్లి బ్రాంచి: తమ్మారెడ్డి భరద్వాజ

శనివారం, 24 జూన్ 2023 (18:38 IST)
Tammareddy Bharadwaja, Ramesh Dembala, Dr. Battini Kirtilatha Goud, Raja Narendra Chetlapelli
రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి  నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి  ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. తొలి ఆట నుంచే ఆర్గానిక్‌ హిట్‌ టాక్‌ను స్వంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమౌతోంది.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుగారు మాట్లాడుతూ...ఇటీవలే ‘బలగం’ అనే సినిమా తెలంగాణ పల్లె జీవితాన్ని, అనుబంధాల్ని కళ్లకు కట్టినట్టు చూపి, సూపర్‌ సక్సెస్‌ అయింది. అదే కోవలో ఇప్పుడు ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా విజయవంతం కావడం సంతోషంగా ఉంది. ఇందులో పల్లె ప్రజల జీవితాల్ని, వారి జీవన చిత్రాన్ని చాలా సహజంగా చూపించిన దర్శకుడు రమేష్‌ చెప్పాలకు అభినందనలు అన్నారు.
 
ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... నిజంగానే మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ప్రజల జీవన విధానాలను, వారిలోని ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకుని చక్కని కథను తయారు చేసుకుంటే సక్సెస్‌ ఖచ్చితంగా వస్తుంది అని మరోసారి నిరూపించిన అద్భుతమైన సినిమా ఇది. ఇటీవలే తెలంగాణ గ్రామీణ జీవితాల్ని ప్రతిభింబిస్తూ వచ్చిన ‘బలగం’ను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా నా దగ్గర చాలా మంది పాజిటివ్‌గా మాట్లాడారు. రియాల్టీకి దగ్గరగా ఉండే కథలు ఎక్కువగా కన్నడ, మలయాళంలోనే వస్తుంటాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఇది మన తెలుగు సినిమానేనా అనే అనుమానం కలిగింది. అంత సహజత్వంతో కూడుకుని ఉంది. మంచి కథ, నటీనటులు, టెక్నీషియన్స్‌ దొరికితే తప్పకుండా విజయం వరిస్తుంది. రాజకీయ పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయి అనే విషయాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పడం అంటే ఆ దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలి. మేం అయితే ఈ సినిమా చేసేవాళ్లం కాదు. కానీ నిర్మాతలు డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి, దర్శకుడు రమేష్‌ చెప్పాల ఎంతో ధైర్యంతో ఈ సినిమా తీసి సక్సెస్‌ కొట్టారు. ఇందులో నటించిన అందరూ నిజంగా చెప్పాలంటే జీవించారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరించాలి అన్నారు.
 
 నిర్మాతల్లో ఒకరైన రాజా నరేందర్‌ చెట్లపెల్లి మాట్లాడుతూ... ప్రేక్షకుల్ని అద్భుతంగా మెప్పించిన మంచి కంటెంట్‌ బేస్డ్‌ సినిమా అయిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’కు నిర్మాత కావడం చాలా గర్వంగా ఉంది. యూనిట్‌ మొత్తం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరూ ఇది మన సినిమా అన్న ఫీలింగ్‌తో పనిచేశారు. అందరికీ కృతజ్ఞతలు. తొలి సినిమాతోనే విజయం అందుకోవడం గర్వంగా ఉంది.  నేటివిటీతో కూడిన మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
 
మరో నిర్మాత డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌ మాట్లాడుతూ... నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవరపల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా చాలా సంతోషంగా ఉంది. తొలి ప్రయత్నమే సక్సెస్‌ కావడానికి మించిన అదృష్టం ఏముంటుంది. ఇంత మంచి కథ ద్వారా మమ్మల్ని నిర్మాతల్ని చేసిన దర్శకుడు రమేష్‌ చెప్పాల గారికి కృతజ్ఞతలు. ఈ కథను విన్నప్పుడే ఇందులో ఉన్న మెసేజ్‌ అర్ధమైంది. ఎంత మంచి కథో.. అంత మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ కూడా మాకు దొరికారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌ వారు రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యింది.  ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌ సినిమాను తన సంగీతంతో మరో లెవల్‌కు తీసుకెళ్లారు. ఇందులో నేను హీరోయిన్‌ తల్లి కూడా నటించాను. అటు నటిగా, ఇటు నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ని జీవితాంతం మర్చిపోలేను. సినిమా నిర్మాణంలోకి అడుగు పెడతున్నాను అంటే చాలా మంది సన్నిహితులు వద్దని వారించారు. కానీ ఈ కథ మీద ఉన్న నమ్మకంతో ముందడుగు వేశాము. మా నమ్మకం వమ్ము కాలేదు. అద్భుతమైన విజయాన్ని అందించారు తెలుగు ప్రేక్షకులు అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు