ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న 'బాహుబలి 2'పై బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. విడుదలైన ప్రతి భాషలోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన 'బాహుబలి 2' చిత్రాన్ని ఇంకా చూడనేలేదన్నారు. పైగా, తమ చిత్రం 'దంగల్'కు 'బాహుబలి'కి ఏమాత్రం పోలిక లేదన్నారు.
‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ ప్రీమియర్ షోకు వచ్చిన అమీర్ ఖాన్ మాట్లాడుతూ తాను నటించిన 'దంగల్' సినిమాకు చైనాలో వస్తున్న స్పందన పట్ల హర్షం వ్యక్తంచేశారు. అయితే తన సినిమాకు, ‘బాహుబలి-2’కు అసలు పోలికే లేదని అన్నారు. ‘బాహుబలి- 2’ను తాను ఇంకా చూడలేదని రిపోర్ట్స్ మాత్రం వింటున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు భారతీయ సినిమాలు దూసుకువెళుతుండటం తనకు చాలా ఆనందానిస్తోందని, అంతమాత్రాన ఈ రెండింటినీ పోల్చలేమని అన్నారు. దేని స్పేస్ దానికి ఉందని చెప్పారు.
కాగా, భారతీయ సినీ చరిత్రలో ‘దంగల్’, ‘బాహుబలి-2’ చిత్రాలు సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాయి. 'దంగల్' చిత్రం చైనాలో విడుదలై కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. అలాగే, 'బాహుబలి' చిత్రం కూడా త్వరలోనే చైనాలో విడుదల కానుంది. అలాగే, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పగా, చైనాలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.