సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో ప్రతినాయక పాత్రను పోషించిన వినాయకన్ చిక్కుల్లోపడ్డారు. దీంతో ఆయనను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మద్యం సేవించి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఎర్నాకుళం నార్త్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషనులో మద్యం మత్తులో గొడవకు దిగడంతో అతడిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
తమను వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన నివాసం ఉంటున్న అపార్టుమెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు స్టేషనన్‌ను పిలిపించారు. ఈ క్రమంలో మద్యం మత్తుతో ఉన్న వినాయకన్ సహనం కోల్పోయి గొడవకు దిగాడు. అతన్ని వారించేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వినాయకన్‌ను పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదని, ఓ మోడల్‌ను వేధించిన కారణంగా గతంలోనూ అతడిని అరెస్టు చేయగా.. ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారని మలయాళ, తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. 'జైలర్' విడుదలైన సమయంలో ఈ కథనాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.