వైజాగ్‌లో గూగుల్ హబ్ ఏర్పాటు కేవలం రాష్ట్రానికేకాకుండా, యావత్ భారత డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం సాకారం కావడంతో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన అభినందనలు తెలిపారు.
అదేసమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జేపీ కీలక సూచనలు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతుల నిర్మించడం ఎంత ముఖ్యమో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా అంతే అవసరమని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే కొన్నేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యయాన్ని నిలిపివేయడం (ఫ్రీజ్ చేయడం)పై దష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ, పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని, ఆ సమయంలో అనవసర ఖర్చులను నియంత్రిస్తే ప్రజా అప్పులను సులభంగా అదుపులోకి తీసుకునిరావచ్చని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుతం బడ్జెట్ యేతర రుణాలు, ఇంకా చెల్లించని బిల్లులను కూడా కలిపితే రాష్ట్ర అప్పులు, స్థూల రాష్ట్రోత్పత్తి నిష్పత్తి 60 శాతం దాటిపోయిందని జయప్రకాశ్ నారాయణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఏమాత్రం నిలకడలేదని, భవిష్యత్‌కు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో చూపిన ఆదేపట్టుదలను, చొరవను ఆర్థిక నిర్వహణలోనూ, వనరుల వివేకవంతమైన వినియోగంలోనూ ప్రభుత్వం ప్రదర్శించాలని ఆయన ఆకాంక్షించారు.