ఈ స్టూడియో నిర్మాణ పనులు ప్రారంభించినట్టు అల్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుటుంబం మొత్తానికి సినిమా అంటే ప్రాణమని, తమకు ఆనందాన్నిచ్చేది సినిమానే అని స్పష్టం చేశారు. అల్లు రామలింగయ్య ఘనవారసత్వాన్ని కొనసాగించేందుకు తమకు సినిమానే మార్గమని ఈ ప్రకటనలో వివరించారు.
అల్లు స్టూడియోస్‌ను ఆయన జ్ఞాపకార్థం అంకితమిస్తున్నామని ప్రకటించారు. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఈ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేశామన్నారు. ఈ స్టూడియోను హైదరాబాద్ నగరంలో నిర్మించనున్నారు. ఇది సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది.
కాగా, ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.