ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

ఠాగూర్

బుధవారం, 8 జనవరి 2025 (19:34 IST)
హైదరాబాద్ వేదికగా జరిగిన హైందవ శంఖారావం సభలో సినీ గేయరచయిత అనంత శ్రీరామ్ చేసిన ప్రసంగంతో వివాదంలో చిక్కుకున్నారు. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత, రామాయణ, భాగవతాల్లో పురాణాలను ఇష్టం వచ్చినట్టు కొందరు మార్చేశారని వ్యాఖ్యానించారు. సినిమాల్లో కర్ణుడు పాత్రకు ఎలివేషన్ ఇవ్వడంపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 
 
ఓ పాటలో 'బ్రహ్మాండ నాయకుడు' అనే పదం వద్దన్నందుకు 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి పాటలు రాయలేదని అనంత శ్రీరామ్ వెల్లడించారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలని, లేదంటే హిందువులే పూర్తిగా ఆ చిత్రాలను బహిష్కరించాలని, అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం ఉంటుందని తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో అనంత శ్రీరామ్ ప్రసంగాన్ని కొందరు ప్రశంసించారు. 
 
మరికొందరు మాత్రం అనంత్ శ్రీరామ్ గతంలో రాసిన కొన్ని పాటల్లోని సాహిత్యాన్ని వెలికి తీసి విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో 'వరుడు కావలెను' సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన "దిగు దిగు దిగు నాగ" అనే పాట వివాదంలో చిక్కుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 
 
నాగరాజుపై ప్రేమతో పాడుకునే భజన గీతాన్ని ఐటమ్ సాంగ్‌‍గా మార్చారని పాట విడుదల సందర్భంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే తొలగించి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధర్మ్ రక్షాదళ్ సంస్థ డిమాండ్ చేసింది కూడా. ఆ పాట రాసిన అనంత శ్రీరామ్‌పై బీజేపీ మోర్చా నాయకులు పలు చోట్ల కేసులు పెట్టారు. 
 
దేవుడిని కించపరిచేలా లిరిక్స్ రాశాడని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడ్డారు. అనంత శ్రీరామ్‌తో పాటు సినిమా యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారాన్ని నెటిజన్లు ఇప్పుడు బయటకు లాగారు. ఇప్పుడు హైందవ ధర్మం గురించి మాట్లాడుతోన్న అనంత్ శ్రీరామ్ హిందూత్వాన్ని, హిందూ సంప్ర‌దాయాల్నీ కించ‌ప‌రిచేలా అప్పుడు సాంగ్ ఎలా రాసాడని కామెంట్స్ చెస్తున్నారు.
 
అలాగే గరికపాటి నరసింహ రావుపై కూడా గతంలో అనంత్ శ్రీరామ్ తన స్థాయికి మించి కామెంట్స్ చేసిన విషయాన్ని మరోసారి వెలుగులోకి తెస్తున్నారు. అనంత్ శ్రీరామ్ ఏం ఉద్దేశంతో, ఏం ఆశించి.. సినిమాలు అందులోని పాత్రలను టార్గెట్ చేశారో కానీ..‌ తాను రాసిన పాటలు మాట్లాడిన మాటలు ద్వారా ఇప్పుడు ట్రోలింగ్ అయ్యే పరిస్థితి వచ్చిందనే చర్చ మాత్రం ఇటు సమాజంలో, అటు చిత్రపరిశ్రమలో జోరుగానే సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు