తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

ఠాగూర్

సోమవారం, 20 జనవరి 2025 (12:19 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిగా 2013లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు  రెండుగా విడిపోయాక పుష్కరకాలం నుంచి తెలంగాణాలో సినిమా అవార్డులను ఇచ్చే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించారు. గతేడాది సమయాభావం వల్ల అది కుదరలేదు. కానీ ఈసారి మాత్రం ఉగాదికి అవార్డుల ప్రధానోత్సవం ఉండనుంది. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాల సపోర్టుగా ఉంటున్న నేపథ్యంలో గద్దర్ అవార్డులపై నిర్ణయం తీసుకుంది. 
 
ఈ యేడాది ఉగాది నుంచి ప్రతి యేటా గద్దర్‌ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డుల కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఇప్పటికే సచివాలయంలో గద్దర్‌ అవార్డుల కమిటీ సమావేశం జరిగింది. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులను అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 
 
జాతీయ సమైక్యత పెంపు, సాంస్కృతిక, విద్య, సామాజిక సంబంధిత చిత్రాలు, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ అవార్డులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. 
 
గద్దర్‌ ప్రతిష్ఠను పెంచేలా అవార్డుల లోగో ఉండాలన్నారు. సినిమా రంగం లో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించినవారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారని, అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. ఫీచర్‌ ఫిల్మ్‌ లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాలపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అవార్డుల్లో నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాలను అందచేయనున్నారు.
 
మరోవైపు, ఏపీలోనూ నంది అవార్డులపై స్పష్టత రావాల్సి ఉంది. 2017లో ఓమారు అవార్డులను ప్రకటించినా.. అనంతరం అవి కంటిన్యూ కాలేదు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం సైతం చిత్ర పరిశ్రమకు అన్ని విధాల తోడ్పాడు అందిస్తున్న క్రమంలో నంది అవార్డులపై కూడా ఎమైనా ప్రకటనా చెస్తారా అన్నది చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు