బాహుబలి పట్ల మీ స్పందన చూసి పట్టలేని సంతోషం ఫీలవుతున్నానని బాహుబలి చిత్ర కథనానాయకుడు ప్రభాస్ చెప్పారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన బాహుబలి-2 ఫ్రీ-రిలీజ్ కార్యక్రమంలో హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన ప్రబాస్ ఇకనుంచి సంవత్సరానకి కనీసం రెండు సినిమాలతో మీ ముందుకు వస్తానని మాట ఇచ్చారు.
బాహుబలి-2 ఫ్రీ-రిలీజ్ కార్యక్రమానికి ప్రభాస్ అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన నటుడు ప్రభాస్ పేరు ఎవరైనా ప్రస్తావిస్తే చాలు హర్షధ్వానాలతో, విజిల్స్ వేస్తూ ప్రభాస్ అభిమానులు ఊగిపోయారు. చివరకు అభిమానుల సందడి అగిపోయేంతవరకు ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన సుమ తన ప్రజెంటేషన్‌ను సైతం నిలిపివేయవలసి వచ్చిందంటే అభిమానుల జోషం ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు
ఈ సందర్భంగా బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి-2 సాంకేతిక బృంద నిపుణులను పేరు పేరునా అభినందించిన రాజమౌళి వారి ఫొటోలను బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించి సినిమాకు వారు అందించిన దోహదాన్ని, వారి పాత్రను బహుధా ప్రశంసించారు.
అంతకుముందు కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ రాజమౌళి, ఆయన తీసిన బాహుబలి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. రాజమౌళి స్థాయి ప్రస్తుతం జేమ్స్ కేమెరూన్ వంటి హాలీవుడ్ డైరెక్టర్లకు ఏమాత్రం తీసిపోదని ప్రశంసించారు.
ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి తమన్న, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు బాహుబలి-2 ఈ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.