బాహుబలి స్పెషల్ ఫేస్ బుక్‌ మొదలెట్టిన ప్రభాస్.. కేటీఆర్ కోరిక తీరినట్లేనా.?

బుధవారం, 12 జులై 2017 (02:22 IST)
తెలుగు సినిమా నిర్వచనాన్ని మార్చిపడేసిన బాహుబలి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచమంతటా గత రెండేళ్లుగా సంచలనాలు కలిగిస్తూనే ఉంది. బాహుబలి ది బిగినింగ్ భారతీయ చిత్రపరిశ్రమలోని మహామహులనే  తన దృశ్య అద్భుతంలో నివ్వెరపోయేలా చేయగా ఇక రెండో భాగమైతే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నను సస్పెన్స్‌గా మలిచి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆసక్తిని శిఖరస్థాయికి తీసుకుపోయింది. విడుదలై 70 రోజులు పైబడినప్పటికీ బాలీవుడ్‌లో దేశమంతటా ఎక్కడో ఒక చోటు ఇంకా ప్రదర్శితమవుతూనే ఉన్న బాహుబలి 2 ఇప్పటికీ 
వార్తల్లో నిలుస్తూనే ఉంది. 
 
తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘బాహుబలి ద బిగినింగ్‌’  సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయింది. 2015, జూలై 10న ఈ చిత్రరాజం ప్రేక్షకులకు ముందుకు వచ్చి అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రేక్షకుల మన్నన పొందడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం విజయంతో రెండో భాగంపై చిత్రయూనిట్‌ మరింత విశ్వాసంతో పనిచేసింది. ఇక ‘బాహుబలి ద కన్‌క్లూజన్‌’ సినిమా రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
 
‘బాహుబలి ద బిగినింగ్‌’  విడుదలై రెండేళ్లు పూర్తైన సందర్భంగా హీరో ప్రభాస్‌ తన సంతోషాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ఈ చిత్రం కోసం పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. చిత్ర యూనిట్‌ అంతా ఎంతో ఇష్టంగా పనిచేసిందని తెలిపాడు. ఇలాంటి గొప్ప అవకాశం రావడానికి కారణమైన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. 
 
బాహుబలి చిత్రానికి పనిచేసిన వారందరినీ అభినందించాడు. తమను వెనకుండి నడిపించిన దర్శక ధీరుడు రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. బాహుబలి చిత్రంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు, ఈ చిత్రం ఇంత విజయం సాగించినందుకు టీమ్ మొత్తం మీకే రుణపడి ఉందంటూ రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తాడు.  ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నాడు.
 
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సినిమా ఇప్పటివరకు 1700 కోట్లపైగా రాబడిని ఆర్జించింది. త్వరలో చైనా, జపాన్, తదితర దేశాల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.
 
ఇంత సంచలనం కొలిపించిన ప్రభాస్ ఇంకా సోషల్ మీడియాలో లేకపోవడం ఏమిటి అంటూ రెండేళ్ల క్రితం తెలంగాణ మంత్రి కేటీర్ ప్రశ్నంచిన విషయం తెలిసిందే. రానా నువ్వయినా ప్రభాస్‌కు ఫేస్‌బుక్‌లోకి తీసుకురాకూడదా అంటూ కేటీఆర్ అప్పట్లో కోరారు. ఇన్నేళ్లకు కేటీఆర్ కోరిక తీరినట్లేనా మరి.
 

వెబ్దునియా పై చదవండి