నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఈ రోజు వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. బాలయ్య తన పుట్టినరోజును అమెరికాలో అభిమానుల సమక్షంలో జరుపుకుంటుంటే.. హైదరాబాద్‌లో బసవతారకమ్ ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్లో బాలయ్య పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి, డైరెక్టర్ క్రిష్, బసవతారకమ్ హాస్పటల్ సి.ఇ.ఓ ఆర్.పి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి 56 కేజీల బాలయ్య బర్త్ డే కేక్‌ను కట్ చేసి పిల్లలకు అందచేసారు. అలాగే రోగులకు పండ్లు, పిల్లలకు గిఫ్ట్‌లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ... సెట్లో అందరితో కలిసిపోతు చిన్న పిల్లాడులా ఉండే మా బాలయ్యకు అప్పుడే 56 సంవత్సరాల అనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని తపించే మంచి విద్యార్థి ఆయన. అలాగే మా అందరికీ మార్గదర్శిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు 99 సినిమాలు చేశారు.
అలాంటి సీనియర్ హీరో దర్శకుడిగా నాకు ఇచ్చే గౌరవం చూస్తుంటే డైరెక్టర్‌కి ఇంత గౌరవం ఇస్తారా అనిపిస్తుంది. బాలయ్య అంటే నాకు సినిమా హీరోగా కన్నా వ్యక్తిగా చాలా ఇష్టం. మా అమ్మకు క్యాన్సర్ వస్తే... ఈ హాస్పటల్‌కే తీసుకువచ్చాను. ఈ హాస్పటల్ స్టాఫ్ మా అమ్మను వాళ్ల అమ్మలా చూసుకున్నారు. ఈరోజు బాలయ్య ఈ హాస్పటల్ ఫండ్స్ కోసం అమెరికాలో ఛారిటీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్నారు. బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్న బాలయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు.
బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి మాట్లాడుతూ... నాన్నగారు 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే ఆశ్యర్యంగా ఉంది. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ ఎనర్జి తగ్గుతుంది కానీ.. నాన్న గారి విషయంలో రివర్స్‌లో జరుగుతుంది. ఇంట్లో మనవడుతో చిన్నపిల్లాడులా ఆడుకుంటుంటారు. మానవసేవే మాధవసేవ అని చెప్పిన తాత గారి మాటలతో స్ఫూర్తి పొంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరి సపోర్ట్‌తో ఈ హాస్పటల్ని బెస్ట్ హాస్పటల్‌గా తీర్చిదిద్దారు. నాన్నగారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నారు.