తెలుగు చిత్ర నిర్మాత సింగలమల రమేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుల వల్ల తాను రూ.100 కోట్ల మేరకు నష్టపోయినట్టు వెల్లడించారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఆ ఇద్దరు హీరోలు కనీసం మాట మాత్రం కూడా పలుకరించలేదని వాపోయారు.
ఇదే అంశంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, 'ఖలేజా', 'కొమరం పులి' సినిమాల వల్ల రూ.100 కోట్లు నష్టపోయినట్టు చెప్పారు. భారీగా నష్టపోయాక కూడా ఎవరూ తనకు సపోర్టు చేయలేదన్నారు. 'కొమరం పులి' సినిమా తీసే సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో తిరిగారని, అలా సినిమా కొంచెం డిస్టర్బ్ అయిందని, ఇప్పటివరకు నన్ను ఎలా ఉన్నావు? నీ సమస్య ఏంటి అని ఎవరూ అడిగిన పాపాన పోలేదని వాపోయారు. 24 క్రాఫ్ట్స్‌పై గ్రిప్ ఉంటేనే సినిమా తీయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవడం బెట్టర్ అంటూ కామెంట్స్ చేశారు.
అయితే, నిర్మాత సింగమనల రమేశ్‌కు మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమాను రమేష్ బాబు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని, తప్పు మీరు చేసి పవన్ కళ్యాణ్‌ని అనడం కరెక్ట్ కాదని, మూడేళ్ల పాటు పవన్ కళ్యాణ్ తన సమయాన్ని వృధా చేసుకున్నారనీ, పవన్ కళ్యాణ్ వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారని, దీనికి ప్రత్యక్ష సాక్షి తానేనని బండ్ల గణేశ్ వెల్లడించారు.