హాస్యానికి బ్రాండ్ అంబాసిడర్ 'అత్తిలి' లెక్చరర్... నేడు 61వ బర్త్‌డే
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:04 IST)
వెండితెరపై హాస్య సన్నివేశాలు రావాల్సిన అవసరం లేదు.. జోకులు పేలనవసరం లేదు.. అసలు మనిషి కూడా కనిపించాల్సిన పని లేదు. ఆయన కంఠం వినిపిస్తే చాలు.. థియేటర్‌లో మొత్తం నవ్వుల పువ్వులే. విజయవంతమైన సినిమాల్నే ఎవరూ ఏళ్ల తరబడి గుర్తుంచుకోలేరు.. కానీ నవ్వులు కురిపించిన పాత్రలను మాత్రం మర్చిపోలేరు. అలాంటి హాస్యపు నవ్వులు కురిపించిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఈయన చిత్ర పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా మారిపోయాడు. ఏ పాత్రలోనైనా చిత్ర విచిత్ర హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే సత్తా ఆయనకే సొంతం. అరగుండుగా.... ఖాన్‌దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్‌ఎంపీగా వైవిధ్య పాత్రల్లో మెప్పించిన నట మేరునగవు. స్వల్పకాలంలోనే వివిధ భాషల్లో వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
జిల్లాలోని ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం దినదిన ప్రవర్థమానమై సాగుతోంది. ఈ హాస్య నటుడి పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మనందం. ఫిబ్రవరి 1వ తేది 1956లో సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో జన్మించాడు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్‌లో విద్యార్ధిగా పాఠాలు నేర్చారు. అప్పట్లో స్వర అనుకరణలు (మిమిక్రీ), సాంస్కృతిక బృందాలలో చురుగ్గా పాల్గొనేవారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్‌ఆర్ కాలేజిలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేశారు. తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు. అత్తిలిలో తొమ్మిదేళ్లపాటు లెక్చరర్‌గా పనిచేసి సినిమా రంగంలో అడుగు పెట్టారు.
తొలిసారిగా కెమెరా ముందు నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజండ్ల సత్యనారాయణ. నరేష్ కథాధానాయకుడిగా నటించిన చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితుల్లో ఒకరిగా బ్రహ్మనందం నటించారు. ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీనే తొలివేషం వేయడం గమనార్హం. తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "అహ నా పెళ్ళంట" ఈ చిత్రంలో యజమాని పిసినారితనాన్ని తనలోనే దిగమింగుకునే అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఆయనపై పడింది.
జంధ్యాల తాను దర్శకత్వం వహించిన 'చంటబ్బాయ్' నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయటం, తర్వాత 'పసివాడి ప్రాణం'లో ఓ చిన్న పాత్ర వేశారు. అరగుండు పాత్రతో నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాల, చిత్రంలో నటించేలా అవకాశం ఇచ్చిన చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడును, ఆ రోజుల్లో అన్ని విధాల ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికి మరువలేను అంటాడు బ్రహ్మనందం.
సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్ ఆయనకు బంగారు కంకణాన్ని బహూకరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. నటుడిగా గుర్తింపు తెచ్చిన ఆహా నా పెళ్ళంట చిత్రంలో నటించిన పాత్రకు ఆయనకు నంది పురస్కారం వచ్చింది. మనీ, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారం పొందారు.
హాస్యనటులు రేలంగి, రాజబాబు, చలం, అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలను బ్రహ్మనందం కైవసం చేసుకున్నారు. ఐదు కళాసాగర్ పురస్కారాలు, తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు, ఎనిమిది భరతమునీ పురస్కారాలు, ఒక ఫిలింఫేర్ పురస్కారం, రాజీవ్‌గాంధీ సద్భావన పురస్కారం, ఆటా సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం వారు గండపెండేరం తొడిగి సత్కరించారు.
హాస్య నటులు రేలంగి వెంకట్రామయ్య, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్యల్లాగా దశాబ్దాల తరబడి సినీ హాస్య సామ్రాజ్యాన్ని ఏలిన ఘనత బ్రహ్మానందంది. ఇప్పటికీ ఆయన శకమే నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రేలంగి, అల్లు రామలింగయ్య తర్వాత హాస్యనటుల్లో 'పద్మశ్రీ' అందుకున్నది బ్రహ్మానందమే కావడం గమనార్హం.
అంతేకాదండోయ్... బ్రహ్మానందం కామెడీ కింగ్ మాత్రమే కాదు.. ట్రాజెడీ కింగ్ కూడా. 'అమ్మ', 'బాబాయ్ హోటల్', 'ఆయనకి ఇద్దరు' చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన విషాదాన్ని తేలిగ్గా మర్పిపోలేం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన 'ముత్యమంత ముగ్గు' సినిమాలో బ్రహ్మానందంలో ఓ భయంకరమైన విలన్ కనిపిస్తాడు. ముత్యాల సుబ్బయ్య 'అన్న'లో అయితే ఆయన విప్లకారుడుగా కనిపిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఆయనలోని కోణాలు అన్నీఇన్నీ కాదు.
బ్రహ్మానందం గురించి ఇంకాస్త.. ఆయన మాటల్లో
* ముద్దపప్పు.. వంకాయ.. నాకు ఇష్టమైన వంటకం. మా నాన్నకూ, పిల్లలకు కూడా అదే ఇష్టం.
* 'లివ్ అండ్ లెట్ లివ్'.. ఇదే నేను నమ్మిన ఫిలాసఫీ. ఏం చేసినా చిత్తశుద్ధితో చేయాలి.
* రాజకీయాల గురించి బాగా అవగాహన ఉంది కాబట్టే.. అస్సలు రాను. ఈ లైఫ్‌ని ఇలా వెళ్లిపోనివ్వండి.