ఈ విచారణలో డ్రగ్ డీలర్ కెల్విన్‌తో చార్మికి ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. కాగా డ్రగ్స్ కేసులో విచారణపై చార్మీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలు దాటకముందే సిట్ అధికారులు విచారణ ముగించారు. కాగా ఈ కేసులో రేపు విచారణకు మరో నటి ముమైత్ ఖాన్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటోంది. మరి ఆమె విచారణకు ఏ విధంగా హజరవుతుందో ఇప్పటి వరకూ స్పష్టతలేదు.
మరోవైపు డ్రగ్ కేసులో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. డ్రగ్ కేసులో నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ కమింగా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కమింగా డ్రగ్ సరఫరా చేసేవాడిగా గుర్తించినట్టు తెలిపారు.
కమింగాను గురువారం కోర్టులో ప్రవేశపెడుతామన్నారు. అతడికి సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని, అతడి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నాలుగు సార్లు భారత్‌కు, ఇందులో రెండు సార్లు హైదరాబాద్‌కు వచ్చాడని ఆయన వివరించారు. ఈ కేసులో కమింగా అత్యంత కీలక వ్యక్తిగా భావిస్తున్నట్టు సబర్వాల్ తెలిపారు.