వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గాడు. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి. యధార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వివాదాస్పద అంశాలను వర్మ ప్రస్తావించారు. అంతేకాదు సినిమా మొదలైన సమయంలోనే కమ్మ కాపు అంటూ రిలీజ్ చేసిన సాంగ్ వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో విజయవాడ చరిత్రను వక్రీకరించారంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. విజయవాడలో ముఖ్యంగా కుల విద్వేశాలను రెచ్చగొట్టేవిధంగా ఉన్న కమ్మ కాపు పాటను సినిమాను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మతో పాటు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఇప్పటికే నోట్ల రద్దుతో కష్టాలు తప్పవని భావించిన వర్మ అండ్ టీమ్ డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది. అందుకే వర్మ ఈ పాట విషయంలో వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన పాటను సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. 'వంగవీటి' చిత్రంలోని 'కమ్మ కాపు..' అనే పాటను తీసేసినట్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ పాటను తీసేస్తున్నట్లు వర్మ తాజాగా ట్వీట్ చేశారు. భావోద్వేగాలతో కూడిన చిత్రమని, ఎవర్నీ అప్రతిష్ఠపాలు చేయదని వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో అనుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ వంగవీటి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శనివారం ఈ చిత్ర ఆడియోను విజయవాడలోనే వర్మ విడుదల చేయనున్నారు.