సీనియర్ ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనతను సీనియర్ నటి కృష్ణవేణి సొంతం చేసుకున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలనాటి సీనియర్ నటి కృష్ణవేణి (102) ఆదివారం ఉదయం వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపంతో పాటు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, కృష్షవేణి మృతిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపుపొందిన కృష్ణవేణి తుదిశ్వాస విడిచారని, ఆమె మృతిపట్ల చింతిస్తున్నట్టు చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణవేణి రాణించి, బహుముఖ ప్రజ్ఞగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్‌ను, ఘంటసాలను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేయడం ద్వారా కృష్ణవేణి ప్రత్యేక గుర్తింపుతో పాటు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారని చెప్పారు. ఈ విషాద సమయంలో కృష్ణవేణి కుటుంబానికి తన ప్రగఢా సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.