రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ''హ్యాట్సాఫ్ నరేంద్ర మోడీ.. కొత్త భారతం ఆవిర్భవించింది.. జైహింద్'' అంటూ రజనీ కాంత్ ట్వీట్ చేశారు. రజనీతో పాటు సినీ లెజెండ్ కమల్ హాసన్, యువ హీరోలు సూర్య, ధనుష్ వంటి పలువురు నటులు సోషల్ మీడియా ద్వారా నరేంద్ర మోడీని అభినందించారు.
అయితే నరేంద్ర మోడీకి రజనీకాంత్ మద్దతు పలకడంపై తమిళ దర్శకుడు అమీర్ విమర్శలు గుప్పించారు. భారతదేశం గతంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొందని అప్పుడంతా నోరెత్తని రజనీకాంత్.. ప్రస్తుతం మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రశంసించడం కొత్తగా ఉందని అమీర్ ఖాన్ విమర్శలు చేశారు. నవ భారతదేశం పుట్టిందని రజనీ చెప్పారు. కానీ ఆయన నటించిన 'కబాలి' చిత్రం పాత భారతదేశం ఉన్నప్పుడే విడుదలైంది.
'బాక్సాఫీసు వసూళ్లు, మీ పారితోషికాన్ని సమర్పించగలరా? మీకు పారితోషికం బ్లాక్‌లో ముట్టిందా? వైట్‌లో ముట్టిందా? 'కబాలి' చిత్రం టికెట్లను ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు కాకుండా ఎక్కువకు అమ్మిన సంగతి అందరికీ తెలుసు' అని అమీర్ మండిపడ్డారు. రజనీకాంత్, పవన్‌కల్యాణ్ మద్దతు వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని కూడా అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. అమీర్ వ్యాఖ్యలపై రజనీ కాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.