డ్రగ్స్ విషయాన్ని ఎందుకంత సంచలనం చేస్తున్నారు..ఎవరికి లాభమన్న రానా

మంగళవారం, 18 జులై 2017 (06:34 IST)
ఐటీ, చిత్ర పరిశ్రమలో కొందరు డ్రగ్స్‌కు అలవాటు పడి ఉండవచ్చని.. అయితే తమ వ్యక్తిగత అలవాటుతో వాళ్లు నాశనమైతే ఫర్వాలేదు కానీ, డ్రగ్స్‌ను వ్యాప్తి చేయకూడదని  టాలీవుడ్ నటుడు రానా పేర్కొన్నారు.  ‘సంచలనం కోసం ఈ కేసును ఉపయోగించుకోకూడదు. డ్రగ్స్‌కు అలవాటు పడిన పిల్లల పేర్లు కూడా బయటపెట్టాలని కొందరు అంటున్నారు. అది తప్పు. పిల్లలు డ్రగ్స్‌ వాడటం అనేది చాలా సున్నితమైన సమస్య. దాన్ని జాగ్రత్తగా డీల్‌ చేయాలి’ అని చెప్పారు. డ్రగ్స్‌ వాడటం తప్పు, చట్ట విరుద్ధమనే విషయాన్ని పిల్లలకు తెలిసేలా చూడాలన్నారు.
 
‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన చిత్రసీమను కుదిపేస్తోన్న డ్రగ్స్‌ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు. ‘మనం ఏదైనా అంశాన్ని పెద్దదిగా చూస్తే అది పెద్దదవుతుంది. డ్రగ్స్‌ వ్యవహారాన్ని పెద్దదిగా చేయడం వల్ల ఎవరికి లాభం’ అని నటుడు రానా ప్రశ్నించారు.  ‘డ్రగ్స్‌ అనేవి సమాజానికి ఏ మాత్రం మంచివి కావని, స్కూలు పిల్లలు కూడా వీటికి అలవాటు పడడం బాధాకరమని అన్నారు.  
 
‘నాకు తెలిసి తెలుగు సినిమాలు చూసేది మన తెలుగువాళ్లలో 12 శాతం మందే. ఫిల్మ్‌నగర్‌ చుట్టూ తిరిగే వాళ్లనే సినిమా ప్రభావితం చేస్తుంటుంది. ఒక హీరోకు ఏదైనా అలవాటు ఉంటే అందరూ దానికి అలవాటు పడతారా ఒక హీరోకు సిగరెట్‌ లేదా మందు తాగే అలవాటు లేకపోతే, ఎవరూ తాగకుండా ఉంటారా’ అని రానా ప్రశ్నించారు.
 
అంతా బాగానే మాట్లాడిన రానా నెగటివ్  యాంగిల్‌తో ముగించడం అంత బాగా లేదేమో..హీరోకు సిగరెట్‌ లేదా మందు తాగే అలవాటు లేకపోతే, ఎవరూ తాగకుండా ఉంటారా’ అని ప్రశ్నించడం ఇదంతే ఇక మారదు, వీళ్లు మారరు అనే ధోరణితో లేదా?
 

వెబ్దునియా పై చదవండి