ప్లీజ్... ఏ నేరం చేయలేదు.. బెయిలివ్వండి : రియా చక్రవర్తి

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (16:09 IST)
ప్లీజ్ తాము ఎలాంటి తప్పు చేయలేదు. డ్రగ్స్ అస్సలే తీసుకోలేదు. కేవలం డ్రగ్స్ వ్యాపారులకు డబ్బులు మాత్రమే చెల్లించాం. ఇదే మేం చేసిన తప్పు. అందువల్ల తమకు బెయిల్ ఇవ్వాలంటూ బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలు ప్రాధేయపడుతున్నారు. ఈ మేరకు వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వారి తరపున లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ కోణం ఉండడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్సీబీ నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే.
 
వీరి జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియగా, స్థానిక న్యాయస్థానం ఆ కస్టడీని అక్టోబరు ఆరో తేదీ వరకు పొడగించింది. ఈ నేపథ్యంలో రియా, షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టులో వారి న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.
 
డ్రగ్స్ అభియోగాలపై రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు సెప్టెంబరు 9న అరెస్టు చేశారు. సుశాంత్‌కు రియానే డ్రగ్స్ సమకూర్చినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ సిండికేట్‌లో రియా చక్రవర్తి ఒక యాక్టివ్ మెంబర్ అని ఎన్సీబీ భావిస్తోంది. 
 
ఈ కేసులో వరుసగా మూడ్రోజుల పాటు రియాను ప్రశ్నించిన ఎన్సీబీ ఆపై ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ఈమెకంటే ముందుగానే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్టు చేయడం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు